నేను సైతం…

Monday, April 13, 2009 9:49
కథలు విభాగంలో ప్రచురించబడినది

స్వామీ! స్వామీ! అంటూ గురువుగారిని పిలిచాడు శిష్యుడు.

నెమ్మదిగా ధ్యానం నుంచి కళ్ళు తెరిచిన గురువు శిష్యునివంక ఏమిటన్నట్టు చూసాడు.

మీరు ప్రపంచం బాగోగులగురించి అంతగా పట్టించుకుంటారు. కొంచెం శిష్యులగురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది.

ఏమి నాయనా! నీకేమి కష్టం వచ్చింది?

నేను ధరించిన ధోవతీ చూడండి గురువర్యా! పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. నాకొక కొత్త ధోవతీని ఇప్పిస్తే…

గురువు శిష్యుడి ధోవతీ వంక తేరిపార చూసాడు. నిజంగానే జీర్ణావస్థలో ఉందది.

సరే అంటూ… గురువు శిష్యునికి ఒక కొత్త ధోవతీ తెప్పించాడు. శిష్యుడు ఆనందంగా కొత్త ధోవతీ తీసుకుని వెళ్ళిపోయాడు. కొంచెం సేపు గడిచాక,
గురువు తన పాఠం శిష్యులకు ఎంతగా వంటపట్టిందో చూద్దామంటూ, శిష్యుని గదికి వచ్చాడు.

నాయనా! ఇప్పుడు అంతా సౌఖ్యమేనా?

ఓ.. ఈ కొత్త ధోవతీ చాల సుఖంగా ఉందండీ.

ఇంకేమైనా కావాలా?

లేదండీ… మరేమీ అవసరం లేదు.

కొత్త ధోవతీ వచ్చిందిగా… పాత ధోవతీని ఏమి చేసావు?

దానిని దుప్పటిగా వాడుతున్నాను గురువర్యా!

ఓహో.. అయితే మరి పాత దుప్పటిని ఏమి చేసావు?

దానిని కిటికీ కర్టెన్ గా వాడుతున్నాను.

మరైతే పాత కిటికీ కర్టెన్ పారేసావనుకుంటాను?

లేదండీ! దానిని వంటింటిలో గిన్నెలు తుడవడానికి వినియోగిస్తున్నాము.

అయితే గిన్నెలు తుడిచే గుడ్డ?

దానిని ఇప్పుడు నేల తుడవడానికి ఉపయోగిస్తున్నాము.

అయితే నేలను తుడిచే గుడ్డ?

చెప్పు నాయనా!

దానిని ఎలా వినియోగించాలో తెలియలేదు. బాగా చివికిపోయిఉంది. అంచేత… సాయంత్రం భోజన సమయంలో వెలిగించే దీపాలకి వత్తిగా వినియోగిస్తున్నాము.

సంతృప్తిగా గురువు వెనుదిరిగాడు.

ఎప్పుడో చదివిన ఒక కథ ఆధారంగా…

మనకున్న వనరుల్ని పూర్తిస్థాయిలో వినియోగించడం మన బాధ్యత. ఈ నేల మనకి పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తి కాదు. మనం మన తరవాత తరాలకి తీర్చాల్సిన అప్పు. వనరుల వ్యర్థపరచడాన్ని ప్రతీ స్థాయిలో అరికట్టాలి.

చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం

Friday, April 3, 2009 14:59
తాత - మనవడు విభాగంలో ప్రచురించబడినది

ఎన్నాళ్ళో గడిచినా, ఎన్నేళ్ళో ముగిసినా ఏ ఏటికాఏడే కళ్యాణమా!
పిల్లను గెలిచావనా, విల్లును విరిచావనా ఆ సంగతి తెలుసుగా పురుషోత్తమా!
కాపురమంతా కారడవిగా, జీవితమంతా కష్టాలుగా..
చేటు చేసిన ఆ సుముహూర్తం చాటుతున్నది ఏ పరమార్ధం,
పరిణయంలో పరమ రహస్యం తెలుసుకుంటే తారకమంత్రం.

రామయ్యా! వివాహ దిన శుభాకాంక్షలు. అసలు నువ్వున్నావా! లేవా? ఏమిటో, చుట్టూ నువ్వు తిరుగాడిన నేల అంటారు తాతగారు. అమ్మ స్నానం చేసిన సెలయేరు అదిగో నీళ్ళు జల్లుకో అంటారు. నాకేమో నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతీ ఊరిలోనూ నీ అడుగులేనా… అసలు ఏది నిజం ఏది అబద్ధం? అసలు ఇలాంటి పుక్కిట పురాణాల్ని నిజంగా జరిగాయని నమ్మించడానికి ప్రయత్నించడంలో ఏమిటి అర్థం? అవి నీ అడుగులు కాకుంటే నీ గొప్పతనం తరిగిందా? ఆ సెలయేటి నీరు అమ్మని తాకితే ఆమె గొప్పతనం హెచ్చిందా?

ఏమిటయ్యా! నీలో నీవే గొణుక్కుంటున్నావు అంటూ పూజారిగారు ముందుకు వచ్చారు.

“ఏమీ లేదండి. శ్రీరామనవమి కదా! దండం పెట్టుకుంటున్నాను. ”

“అదేమిటయ్యా! నీకు ఈ దేముళ్ళూ గట్రా నమ్మకం లేదనుకుంటానే. ”

” నాకు నమ్మకం ఉందో లేదో నాకు తెలియదండి.. కానీ నేను పెట్టే ఈ దండం మా తాతకి ఆనందాన్నిస్తుంది. నేను పెట్టే ఈ దండం నాకేమీ నష్టాన్ని కలిగించడం లేదు. ఒక దండం పెడితే నేనేమన్నా అరిగిపోతానా కరిగిపోతానా – అందుకని పెట్టేస్తున్నా”

“అయితే ఇంతకీ దండం ఎవరికి పెట్టావు? ఏమని పెట్టావు? ”

“తెలీదండి… చేతులు రెండూ జోడించా… ఎదురు విగ్రహాన్ని చూస్తున్నా. ఏమని అడగాలో తెలియడం లేదు. పూజారిగారూ, చిన్న సందేహం – నిజంగా కోవిల వెనకున్న పాదాలు రాముడివేనా? ఆ కోనేట్లో సీతాదేవి నిజంగా స్నానం చేసిందా? నేను వాల్మీకం చదివాను. ఎక్కడా రాముడు ఈ దారంట వెళ్ళినట్టుగా చెప్పబడలేదు. అయినా అంతవరకూ ఎందుకు.. నిజంగా అప్పటి ముద్రలు ఇప్పటిదాకా ఎందుకు మిగిలుంటాయి? నిజంగా మిగిలితే మరి ఆ ఒక్క అడుగే ఎందుకు మిగిలింది? ఇక్కడ ఒక అడుగు వేసి రాముడు మళ్ళీ లంకలో ఇంకో అడుగు వేసాడా ఏమిటి? అయినా రామాయణం జరిగిందంటారా? అది నిజంగా జరగలేదు అని అనుకున్నంత మాత్రాన రాముడికి కానీ, వాల్మీకికి కానీ, నమ్మే మనుష్యులకి కానీ వచ్చే నష్టం ఏమిటి? ఒక పురాణ కథని చరిత్రగా కలిపెయ్యటం ఎందుకు?”

“నీ ఉద్దేశ్యం ఏమిటి? ఇలా ఎందుకు జరిగిందంటావు? దీనివెనుక ఏమన్నా సుదీర్ఘ కుట్ర దాగి ఉందని నీ అభిప్రాయమా? తరతరాలుగా ఏదైనా ఒక వంశం తన స్వప్రయోజనాన్ని ఆశించి రాముడిని ఇలా ప్రతీ ఊరిలోనూ నడిపించి ఆ డబ్బులు తినేస్తోందనో లేకే వేరే ప్రయోజనాల్ని ఆశించి చేస్తున్నాదంటావా? ”

“లేదండి. అలాంటి అవకాశం కనిపించటం లేదు. ఇవన్నీ వైవిధ్యసంస్కృతులు పరిఢవిల్లిన ప్రదేశాలు. ఇలా జరగటానికి కారణం ఏమైఉండచ్చు అన్నది తెలియటం లేదు కానీ, ఏదో ఆశించి ఎవరో ఒకరో, ఒక కుటుంబమో ఇలా చేసే అవకాశం లేదు.”

“రామాయణాన్ని ఇతిహాసం అంటారు నాయనా! అంటే జరిగిన పురాణ కథ అని. అయితే సంవత్సరాలు గట్రా పేర్కోకుండా ఎందుకు చేసారు అన్నది ప్రశ్న. వాల్మీకం చదివానంటున్నావు కదా – రామాయణం ఎలా ప్రారంభమౌతుంది నాయనా? ”

“వాల్మీకి మహాముని నారదుడిని పురుషోత్తముడెవ్వడు అని అడిగితే… రాముడని ఒకడున్నాడు – సత్యవంతుడు, జితక్రోధుడు, ధర్మపరాయణుడు అంటూ కథ మొదలవుతుంది. ”

“రామాయణం తాలూకు పరమార్థం అదే నాయనా! ఒక పరిపూర్ణమైన వ్యక్తి తాలూకు నడవడిక ఎలా ఉండాలి.. తనపట్ల, భార్య పట్ల, అన్నతమ్ముల పట్ల, కుటుంబం పట్ల, స్నేహితులపట్ల, సమాజం పట్ల, అతని బాధ్యతలేమిటి – అతని హక్కులేమిటి – అతని నడవడిక ఎలా ఉండాలి… ఇది తెలియచేసే కథ నాయనా అది.

ఇంతకీ, ఈ అడుగడుగునా ఉన్న రాముడి చిహ్నాలు మన పూర్వీకులు ఒక ప్రయోజనాన్ని ఆశించి కల్పించారు నాయనా! అందులో ఎన్ని నిజాలు ఎన్ని అబద్ధాలు అనేవి వాటి తాలూకు ప్రయోజనరీత్యా పూర్తిగా అప్రస్తుతాలు. అవన్నీ మనకు గుర్తు చేయాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే రాముడు ఒక మనిషి అని. రక్తమాంసాలతో ఈ భూమి మీద చరించిన ఒక మానవుడు ఎంత మహితాత్ముడయ్యాడో జాతి మర్చిపోకూడదు అన్నది మన పూర్వీకుల ఉద్దేశ్యం. He is a risen ape – not a fallen angel. మానవత్వానికీ, మనిషి గడపాల్సిన జీవనవిధానానికీ ఒక ప్రతీక రాముడు. ఈసారి రామపాదాలు చూసినప్పుడు వాటి మీద పసుపూ కుంకుమలు చల్లేకంటా, వాటినుంచి ప్రేరణ పొందు. ఒక అన్నగా ఎలా ఉండాలి – ఒక కొడుకుగా – ఒక భర్తగా – ఒక స్నేహితుడిగా –ఒక నాయకుడిగా – చివరికి ఒక శత్రువుగా రాముడులాంటి వ్యక్తిగా ఉండటానికి ప్రేరణ పొందు నాయనా! అవన్నీ మన అందుబాటులో ఉన్న మనం చేయగలిగిన పనులే అని మనకి తెలియచెప్పడం ఈ చిహ్నాల ఉద్దేశ్యం. ఆ చిహ్నాలు పూర్తిగా తప్పు పద్ధతిలో వాడబడచ్చు. వాటిని దురాశాపరులు చాలా విధాలుగా సొమ్ము చేసుకోవచ్చు. కానీ, వాటిని చూసిన లక్షలాదిమందిలో ఏ ఒక్కరు వాటిని చూసి ప్రేరణపొందినా వాటి ఫలితం నెరవేరినట్టే.

ఈసారినుండి గుడిలో రామ విగ్రహాన్ని చూసినప్పుడు మనిషిలోని మహిమకు దండం పెట్టు నాయనా! ఒక మనిషి సంకల్పంతో, విశ్వాసంతో ఏమి సాధించవచ్చు అన్న ఒక తార్కాణాన్ని చూస్తూ నీలోని ఆత్మశక్తికి దండం పెట్టు నాయనా! నీ సమాజం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ స్నేహితులపట్ల నీ బాధ్యతని నిర్వర్తించే శక్తిని ప్రసాదించమని వేడుకో నాయనా! రాముడు నిజంగా ఈ భూమి మీద నడయాడినా, ఒక కల్పిత పాత్రే అయినా నీ వర్తమానానికి వచ్చిన లోటేమీ లేదు. నీ భవిష్యత్తుని, నీ సమాజ భవిష్యత్తునీ మరింత మెరుగుగా చేయడానికి రాముడి సాయం తీసుకో నాయనా! శ్రీ రామాయనమః ”

ఆలోచిస్తూ రామవిగ్రహం వంక చూసా. మరింత వెలుగులో కనిపిస్తున్నాడు కోదండపాణి. నిజమేనా.. నా వెనక అప్పుడే వెలిగిన బల్బు వల్ల అలా అనిపిస్తున్నాదా?

బ్లాగర్లందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.

ఏవి తల్లీ! నిరుడు కురిసిన హిమసమూహములు

Sunday, February 8, 2009 21:29
విజయనగరం విభాగంలో ప్రచురించబడినది

అయ్యలారా! అమ్మలారా! మా ఊరు విజయనగరం. విద్యానగరం. ఘంటసాల వారు నడయాడిన నేల. గురజాడ వారి గుర్తులు మిగిలిన నేల. కొంచెం కొంచెంగా మా సంస్కృతినీ, ప్రాభవాన్నీ, కళాపోషణనీ వదిలేస్తూ – మా తాతలు తాగిన నేతిని మా మూతుల దగ్గర వాసన చూడమంటున్నాం గానీ… ఐనా మాది విజయనగరమే – విద్యానగరమే…
15 సినిమా హాళ్ళతో, 10 పిజ్జా కార్నర్లతో ఇవాళ ఇలా కళకళలాడిపోతున్నాం గానీ – నా చిన్నప్పుడైతేనా అబ్బబ్బ – ఆ అవధానాలూ,అప్రస్తుత ప్రసంగాలూ – ఆ అవధాని విజయనగర ప్రజల ఆసక్తికీ, ఆశక్తి కీ నాలుగు నమస్కారాలు పెట్టి చెంపలేసుకోవడం – ఎంత విసుగుగా ఉండేదనుకున్నారు? అయినా రివ్వున ప్రపంచం 21వ శతాబ్దంలోకి దూసుకుపోతూ ఉంటే, మేము సైతం… మేము సైతం అంటూ కాస్త ఉన్నవి వదిల్చేసుకుంటున్నాము అంతే…

నా ఐదవ క్లాసులో అనుకుంటా.. మేడసాని మోహన్‌ గారి శతావధానం. యశస్వి యస్వీజోగారావు గారి అప్రస్తుతప్రసంగం. అవధానం సాగుతోంది. ఒక అమ్మాయి లేచి పొట్టిగా ఉండే మేడసానివారిని చూసి మీరు అమితాబ్ బచ్చన్‌ లా ఉన్నారండీ! అన్నాది. నేనమితాబ్బునైనను, జయబాధురీవు కాకుము తల్లీ! హేళనమాని నా మానమ్మున నన్ను పోనిమ్ము మంజులవాణీ! అన్నారాయన. వింటున్న యస్వీజోగారావు గారు – పొట్టిగా ఉన్నానని మీరు ఏడుస్తారనుకున్నానే – సరిలెండి అల్లసానివారు అల్లనల్లన ఏడ్చె మరి మేడసానివారు ఎట్లేడ్తురో! సమస్యను పూరించండి అన్నారు. పూరణ గుర్తులేదుగానీ, పూర్తవుతూండగానే మహానుభావుడు దాశరధిగారు ముఖ్య అతిధిగా సభలో అడుగుపెట్టారు. అవధాని లేచి నుంచుని దాశరధీ! కవితా పయోనిధీ అన్న మకుటంతో 11 పద్యాలు చెపుతూ ఉంటే – సభంతా లేచి నించుని కరతాళధ్వనులు చెయ్యడం ఎంత విసుగుగా ఉండేదనుకున్నారు – అబ్బో – నేను కాబట్టి ఏదో అలా కూచుని భరించానండి.
మోహనా! అవధాన కంఠీరవా! అంటూ వేదికమీదున్న మానాప్రగడ శేషసాయిగారు పద్యం పాడేస్తున్నారు. ఆపండి అని గట్టిగా అరిచిన జోగారావుగారు – ఇది సింహం పిల్లకాదు – సింహమే అన్నారు. నిండా 30 ఏళ్ళ వయస్సు లేని అవధానిని చూస్తూ – జూలు కనిపించలేదు అందుకని కంఠీరవా అన్నాను అని సర్దుకోబోయారు శేషసాయిగారు. జూలోకొస్తేగా నా జూలు సంగతి తెలిసేది అని మోహన్‌ ముక్తాయింపు. అయ్యా!అమ్మా! ఇందులో ఆనందించేదిగాని, ఆహ్లాదపరిచేదిగాని ఏముందండి… ఏమీ లేదు.
చిన్నప్పుడు చక్కగా పైడితల్లి అమ్మవారి పండగ అంటే 10 రోజులముందునుంచీ పులివేషాలు, కర్రసాములు, కత్తిసాములు ప్రారంభమయ్యేవి. పులివేషం ఒక 30 కేజీల పిల్లవాడిని పంటితో ఎత్తి కరచిఉంచి పులి అడుగులు వేసేవారు. కర్రకి అడుగున కుంకుమ అంటించి కర్రసాము జరుగుతూ ఉండేది. ఎదుటివాడి నుదుట కర్రతో కుంకుమబొట్టు పెడితే విజయం. మనిషి నాలుకమీద తమలపాకునుంచి ఒకే కత్తివేటుతో దానిని రెండు ముక్కలు చేసేవారు. ఇలాంటి నిరుత్సాహభరిత జీవరహిత – అదేనండీ నాలుక గీసుకోవడానికి కూడా పనికిరాని కళలనుంచి – రాత్రంతా సినిమాలు, చూడ ముచ్చటేసే రికార్డింగు డాన్సులు – ఈ రెంటికీ ముందు మానసిక స్థిరత్వానికి మందుకొట్టడాలు – అబ్బో – మా ఎదుగుదల గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే సాధ్యమా!
శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు వారి ఉత్సవాలు జరిగేవి. తంజావూరులో త్యాగరాజ ఉత్సవాలు ఎలాగో మాఊరికి ఇవి అలాగ. రాష్ట్రమంతా పేరుగాంచిన హరికథకులు వచ్చి కథ చెప్పేవారు. అమ్ముల విశ్వనాధం భాగవతార్ లాంటివారి కథకు కూర్చోడానికి జాగా దొరికేది కాదు. సంగీతసాహిత్యసవ్యసాచుల్లాంటి వాళ్ళు కథ చెప్తూ ఉంటే – ఇది నిజమవ్వచ్చా, లాజిక్కేదీ లాంటి ప్రశ్నలే రానివ్వకుండా కథలో లీనం చేసేసేవారండి. ఈ మత్తు ఉంది చూసారూ – అసలు పురాణాలే కట్టుకథలండి – వాటి అస్తిత్వాన్ని ప్రశ్నించాలి కదండి – అసలు వాళ్ళు కథ చెబుతూ ఉంటే అసలు ఆలోచనే వచ్చేది కాదండి. ఇయంసీతా మమసుతా అన్న శ్లోకం చదివి అమ్ముల విశ్వనాథం గారు దాని అర్థాన్నీ, రాముడు తానందుకున్న చెయ్యిని ఎంత అపురూపంగా కాపాడుకున్నాడు అని చెబుతూ ఉంటే – చిన్న వయస్సు కదండి – తెలిసేది కాదు – ఎందుకో – చూసుకుంటే కళ్ళ నీళ్ళండి. అంత మూర్ఖంగా అమాయకంగా ఉండేవాళ్ళమా అండి – ఇప్పుడు చూసుకోండి మా బొంకులదిబ్బమీదొట్టు – వారంరోజులు జరిపే ఉత్సవాల్ని 2 రోజులు జరపడానికి కానీ, కనీసం 50 మంది ప్రేక్షకుల్ని కూడగట్టడానికి కానీ మూడు చెరువులు (అదేనండి – అయ్యకోనేరు, పెద్దచెరువు,బుచ్చన్నకోనేరు) నీళ్ళు తాగుతున్నారు మా వాళ్ళు. మేము ఎదిగిపోయామండి.

నా స్నేహితుడు ఒకడనేవాడండి – ఈ ప్రపంచంలో ఏ పాయింటు కైనా X,Y,Z లతో పాటు టైం అనే నాలుగో అక్షం ఉంటుంది. ఇది ప్రతి క్షణానికీ మారిపోతూ ఉంటుంది. ఈ నిరంతర చలనమే జీవాధారం. ఈ మార్పే శాశ్వతం. కాకుంటే మన విజయనగరానికి సమస్య ఏమిటంటే ఈ టైం అన్న అక్షం విజయనగరానికి సంబంధించి 1900 లో ఆగిపోయింది అనేవాడండి. అప్పట్లో ఎంత బాగా తిట్టాడు విజయనగరాన్ని అని గొప్ప ఆనందపడిపోయేవాడ్నండి. ఇవాళ మా ఊరిని చూసుకుంటే, అది శాపం కాదు – వరం – నిజమైపోయినా బాగుణ్ణు అనిపించేస్తోందండి. ఆరోజు అదీ మన చేతుల్లోలేదు. ఈరోజు ఇదీ మన చేతుల్లో లేదు. ఏమి చేస్తాం చెప్పండి?

అయినా ఫుల్లు ఎడుకేటెడ్ ఐన మన బ్లాగర్లు ఇంత సాంప్రదాయంగా, సంస్కారవంతంగా, సహన పూరితంగా, సౌశీల్యంతో సహవాసం చేసేస్తూ ఉన్నారు – ఇది కూడా మనం నేర్చేసుకోవాల అని మా ఊరి జనానికి డప్పేసి కొట్టేసి సెప్పెయ్యాల! మరి మేము కూడా డెవలప్ కావాలి కదేటి?

బ్లాగు విలాప కావ్యం…

Saturday, January 24, 2009 23:26
అవీ ఇవీ విభాగంలో ప్రచురించబడినది

నే నొక బ్లాగుమొక్క కడ నిల్చి చివాలున లింకునొక్కి డె
ల్లన్నంతలోన, టపా లన్నియు జాలిగ నోళ్ళు విప్పి “మా
ప్రాణము తీతువా” యనుచు బావురు మన్నవి; క్రుంగిపోతి; నా
మానసమం దెదో తళుకు మన్నది బ్లాగువిలాప కావ్యమై.

జల్లెడ యొడిలోన కూడలి తల్ప మందు
ఆడుకొను మమ్ములను బుట్టలందు చిదిమి
అమ్ముకొందువె మోక్ష వ్యాఖ్యల కొరకు!
హృదయమే లేని నీ టపా లెందుకోయి?

జడమతుల మేము; జ్ఞానవంతుడవు నీవు;
బుధ్ధి యున్నది; భావ సమృద్ధి గలదు;
బండబారె నటోయి నీ గుండెకాయ!
బ్లాగర్లకై పూయదే నాల్గు చిన్ని టపాలు?

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన కూడలి జా
తీయత దిద్ది తీర్తు ము; తదీయ కరమ్ములలోన స్వేచ్ఛమై
నూయల లూగుచున్ మురియుచుందుము; ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము ఆర్కైవు చల్లని కాలి ఫైళ్ళపై.

బ్లాగర్లని గౌరవింతుము జ్ఞానము పూసి; సమాశ్రయించు పాఠకులకి
విందు చేసెదము కమ్మని నవ్వులు; మిమ్ము బోంట్ల నే
త్రాలకు హాయిగూర్తుము; స్వతంత్రుల మమ్ముల స్వార్ధ బుద్ధితో
తాళుము త్రుంప బోవకుము; టపాకి వ్యాఖ్యకు వేరు సేతువే!

గొంతు దురద కోసమయి అన్యుల గొంతులు నొక్కి తెచ్చు పు
ణ్యాత్ముడ! నీకు మోక్ష మెటు లబ్బును? నెత్తురు చేతి టపా వి
శ్వాత్ముడు స్వీకరించునె? చరాచరవర్తి గూగులు మా పవి
త్రాత్మల నందుకోడె! నడమంత్రపు నీ తగులాట మేటికిన్?

ఊహ దారాలతో గొంతు కురి బిగించి
గుండెలో నుండి వ్యాఖ్యలు గ్రుచ్చి కూర్చి
పంచుకొందురు ముచ్చట లింకుల మమ్ము
అకట! దయలేని వారు మీ యాడువారు

గుండె తడి లేక విజిటర్ల లెక్కను పిండి
అత్తరులు చేసి మా పేద నెత్తురులను
బ్లాగు దేహాలపై కీర్తి కొరకు
పులుముకొందురు మీ రాకాసిబ్లాగర్లు

అక్కట! హాయి మేము అనానిమస్సులెందరొ నాల్గు ప్రక్కలన్
ప్రక్కల మీద చల్లుకొని మా పసిమేనులు పాడు వ్యాఖ్యలతో
ద్రొక్కుచు దొర్లి – దొర్లి – మరు రోజుదయాననె వాడి వత్తలై
రెక్కలు జారిపోఁ పరిహరింతురు మమ్ముల పెంటదిబ్బ పై.

మా వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మరంద మాధురీ
జీవిత మెల్ల మీకయి త్యజించి కృశించి నశించిపోయె; మా
యౌవన మెల్ల కొల్లగొని ఆ పయి డెలీటుతోడ చంపి మ
మ్మావల పారబోతురు గదా! బ్లాగుజాతికి నీతి యున్నదా !

బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు
సహజ మగు ప్రేమ నీలోన చచ్చెనేమి?
అందమును హత్య చేసెడి హంతకుండ!
మైలపడిపోయె నోయి! నీ మనుజ జన్మ.

టపా లేకున్న బాబు నీ పున్నె మాయె!
కోయ బోకుము మా పేద కుత్తుకలను
అకట! చేసేత మమ్ముల హత్య చేసి
బాపుకొన బోవు ఆ మహా భాగ్య మేమి?

ఇట్లు టపాలు నన్ను చీవాట్లు పెట్టి
నట్లుగాన్ – బ్లాగు చంప చేయాడలేదు;
ఏమి తోచక దేవర కెరుక సేయ
వట్టి చేతులతో ఇటు వచ్చినాను

ఈ మధ్య వరసగా మూసేస్తున్న బ్లాగులను చూస్తూ ఉంటే కలిగిన చిన్న చిలిపి ఆలోచన. చాలా చోట్ల ఛందస్సు తప్పింది – మూలాన్ని మీకు స్ఫురింపచేయడం కోసం అలా చెయ్యాల్సి వచ్చింది. పద్యశిఖామణులు క్షమించాలి. కరుణశ్రీ గారికి కృతజ్ఞతలూ,క్షమాపణలూ ఒకేసారి అందచేస్తూ… సహస్రవందనచందనాలర్పిస్తూ…

భవదీయుడు
చివుకుల కృష్ణమోహన్‌

స్వరరాగగంగాప్రవాహమే…

Sunday, December 14, 2008 0:21
అవీ ఇవీ విభాగంలో ప్రచురించబడినది

ఉత్సుకత – ఉత్కంఠ – ఉద్వేగం. అన్నీ కలగలిపిన అదో విచిత్రమైన అనుభూతి. కొన్ని క్షణాలలో నేనింక ఆనందపు అవధులను దాటి ఆకాసపు ఆ కొస అందుకోబోతున్నానని. కాలం గడవటం లేదు. ఎలా ఉంటుంది ఆ అనుభూతి. నిజంగా నన్ను నేను కోల్పోతానా – అనాది జీవన వేదంతో కంపిస్తానా ఎద కనుమలలో విరించి విపంచి గానం వినిపిస్తుందా – ఆలోచనలు ఎడతెగటం లేదు.
నాకు కర్నాటకశాస్త్రీయ సంగీతమంటేనే పరిచయం లేదు. అప్పుడప్పుడూ విన్న బాలమురళి పంచరత్నాలూ, రామదాసు కీర్తనలూ, మరిన్ని నేదునూరి ఆలాపనలూ – వినడం – ఆహా బానే ఉందే – అనుకుని కదిలిపోవడం తప్ప శాస్త్రీయ సంగీత కచేరీని పూర్తిగా విన్నది లేదు. హాలులో కూర్చున్నాను. ఉత్సుకతతోపాటు కొంచెం అనుమానం, కొంచెం అపనమ్మకం. ఎప్పుడు చప్పట్లు కొట్టాలో కూడా తెలియదు. అసలు రాగం అంటే తెలిస్తేగా రాగాలాపన బాగుందని మెచ్చడానికి. మూడు గంటలు కూర్చోగలనా అన్న అనుమానం. చుట్టూ ఉన్నవాళ్ళకి మనకంటా బోలెడు తెలుసేమో అన్న సందేహం. మన అజ్ఞానం బయటపడిపోతుందేమో అన్న సిగ్గు. ఐనను, ఇవాళ విని తీరాల్సిందే అని కూర్చున్నాను.

నెమ్మదిగా కార్యక్రమం ప్రారంభమయ్యింది. పరిచయకర్త పక్కవాద్యగాళ్ళని పరిచయం చేస్తున్నాడు. ఘటం, మృదంగం – ఒక్కొక్కరూ వచ్చి సభకి నమస్కారం చేసి తమ స్థానాల్లో కూర్చుని శ్రుతి సరిచూసుకుంటున్నారు. పరిచయకర్త గొంతు పెంచాడు. వయొలిన్ చక్రవర్తి, స్వరరాజు, పద్మభూషణ్ డాక్టర్ ఎల్. సుబ్రమణ్యం అంటూ పెద్దగా పిలిచాడు. చిన్నగా పొట్టిగా బక్కగా ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా వేదికమీదకి వచ్చి అందరికీ నమస్కారం చేసి తన స్థానంలో కూర్చున్నాడు. అంతకు ముందు టీవీల్లో గట్రా అతని ఫోటో చూసాను – అయినా ఏమిటో చెప్పలేని అనుభూతి. ఇతనేనా ఆ స్వరబ్రహ్మ? కమానుతో ఆ చిన్న వాయిద్యాన్ని పట్టుకున్నట్టు నటిస్తూ మనందరినీ వాయులీనం చేసే మాంత్రికుడు ఇతడేనా? ప్రశ్నలు – సమాధానాలు లేని ప్రశ్నలు – కుదురుగా ఉండనివ్వని ప్రశ్నలు.
నవరాగమాలికలో ఒక వర్ణంతో కచేరీని ప్రారంభిస్తున్నా అని చెప్పి మొదలెట్టారాయన. నేను వింటున్నానో లేదో నాకే తెలియదు. నాలోకి నేను తొంగిచూసుకోవడంతోనే సరిపోతోంది. ఇదేనా ఆ అవ్యక్తమైన అనుభూతి – ఇదేనా అవధులు లేని ఆనందం – పలుకుతున్న ప్రతి స్వరానికీ నాలోనేను ఆడుకుంటున్న దోబూచులాట. నెమ్మదిగా స్వరసంచారం వేగాన్నందుకుంటోంది. వేగాన్నే ఆస్వాదించాలా – తెలియటం లేదు. చుట్టూ చప్పట్లు. ఓహో, ఇది చప్పట్లు కొట్టే సమయం కాబోలనుకుంటూ నేను ఒక రెండు కొట్టా. ఇప్పుడు ఖరహరప్రియరాగంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన, రూపకతాళంలో అన్నారాయన. అంటే ఏమిటో కూడా తెలియదు నాకు. పక్కనున్న పక్కవాయిద్యం వాళ్ళు కూడా ఆపేసి వింటున్నారు. నెమ్మదిగా చిన్న పిల్లకాలువ వేషం వేసుకుని గంగమ్మ తల్లి హరిపాదాన్ని విడి అలకనందాదేవిగా చిన్న నడకలు నడుస్తున్నాది. ఓస్ ఈ గంగమ్మకేనా జనాలు మొక్కేది – ఈ గంగమ్మకేనా శివుడు జటాజూటాన్ని విప్పాల్సి వచ్చింది – ఒక పక్క అనుమానం – మరోపక్క ఉత్సుకత. గమనం సాగుతోంది. ఘటం, మృదంగం, కంజిర, మోసింగు వాయిద్యం వాళ్ళు తమ తమ ప్రతిభ చూపిస్తున్నారు. చిరునవ్వుతో ఆయన తాళం వేస్తూ వారిని చూస్తున్నారు. నా మెదడు మనసులోకి చూడలేకపోతోంది. అనుభూతిని కొలవమంటే నావల్లకాదు అని చెప్పేస్తోంది. ఏమి జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. ఆ క్షణాన్ని, నన్ను నేను కోల్పోయిన క్షణాన్ని, తాదాత్మ్యం చెందిన ఆ క్షణాన్ని, అలా వడిసిపట్టుకోవాలనుకున్నానే. అప్పుడు నన్ను నేను చూసుకోవాలనుకున్నానే. నాకేమి జరుగుతోంది. తాళం అంటే గోద్రెజ్ తాళం గుర్తొచ్చే నేను అసంకల్పితంగా నా పాదాల్ని కదుపుతున్నానేమిటి? స్వరరాగగంగాప్రవాహంలో కొట్టుకుపోతున్నానేమిటి? ఈత కొడుతూ నాకు నచ్చినట్టు నేను ప్రయాణించాలనుకున్నానే. ఇదేమిటి ఇతనెవరు నన్ను లాక్కెళ్ళిపోతున్నాడు.. నేనొప్పుకోను – నేను లేచి నించోవాలి – నా మెదడు రిమోటు కంట్రోలు నానుంచి ఎవరిదగ్గరకి వెళ్ళిపోయింది… స్వరకల్పన తారాస్థాయినందుకుంది.
నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యం.
ప్రళయాభీల తరంగిత లీల భయంకరహేల శివంకరుగ్రోల లయించగ చేరగా
అలలై కలలై వడిగా జడిగా
పిడుగుల అడుగుల తడబడు నడకల
చలంచలితపదనూపురఘోషల
కలితనాట్యఘటితఛ్ఛకచకితతటిల్లతాతనూలతికద్యుతిసురఝురజర్ఝరీనాదసందోహిత
దివివధూటి సాగుతోంది… మునుగుతున్నాను – నా అస్తిత్వమే నాకు తెలియటంలేదు. లేచి నించుని చప్పట్లు కొడుతున్నాను. పక్కవారి స్పృహే లేదు. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారన్న ఆలోచనే లేదు. తేరుకుంటూంటే మొదటగా చూపు నా వశంలోకి వచ్చింది. కలుస్తున్న నా రెండు చేతులూ కనిపిస్తూ. నెమ్మదిగా ఆ రెంటి కలయిక సృష్టిస్తోన్న ధ్వని చెవినంటింది. నెమ్మదిగా చూపు అటూ ఇటూ తిప్పాను. నాలాగే నించుని ఉన్నారు అందరూ… పశువుల శిశువుల ఫణుల శిరసులూగే పాట పంచామృతాన్ని పానం చేసాను.
ఇంతకీ నా ప్రశ్నలన్నీ ఏమయ్యాయి – ప్రశ్నలే గుర్తుకురావటం లేదు – ఇంక సమాధానాలా … మీకేమైనా తెలిస్తే చెబ్దురూ…